Wednesday, September 1, 2010

తులసి , Tulasi (Ocimum tenuiflorum)

 • * తులసి ( Tulasi) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). ,ఓసిమమ్‌ సాంక్ట్రమ్‌(Ocimum Sanctrum).ఇందులో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అనీ అంటారు. వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు. ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని అధికంగా వాడుతారు.
 • * అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మధించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. * తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు. మనుషులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది. * హిందువులే కాకుండా ఇతర ప్రాంతాల, దేశవాసులు కూడా తులసికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు హైషియన్ వర్తకులు తమ అంగళ్లలో దుష్టశక్తులు రాకుండా తులసి నీళ్లను జల్లుతారు. నవీన మెక్సికన్ గ్రామ ప్రాంతపు ప్రజలు తమ మనీపర్సుల్లో తులసి ఆకులను పెట్టుకుంటారు. ఇలాచేయడంవల్ల ధనలక్ష్మి కరుణిస్తుందని వారు నమ్ముతారు. మెక్సికన్ సంస్కృతిలో మహిళలు, తమ భర్తలు ఇతర మహిళల వెంట పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ రొమ్ముల మీద తులసి పొడిని జల్లుకోవటం ఆచారంగా ఉంది. * సర్ జె.సి.బోస్ తను చేసిన వృక్షశాస్త్ర అధ్యయనాల్లో మొక్కలు కూడా మనుషుల మాదిరిగానే స్పందిస్తాయని సాక్ష్యాధారాలతో సహా రుజువుచేసారు. హిందూ సంస్కృతిలో మొక్కలను పవిత్రంగా, తోటి జీవకోటిగా గౌరవించటం ఆచారంగా ఉంది. ఇదే ఉద్దేశ్యంతోనే తులసిని పవిత్రంగా పూజిస్తారు. ఇలాంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆయుర్వేద గ్రంథాలు అవసరం లేకుండా మొక్క భాగాలను పీకడం, తుంచటం వంటివి చేయవద్దని హితవు చెబుతాయి. * తులసికి సంస్కృతంలో చాలా పేర్లున్నాయి. సురస (మంచి రసం కలిగినది), సులభ (సులభంగా లభించేది), విష్ణువల్లభ (విష్ణుమూర్తికి ఇష్టమైనది), అపేతరాక్షసి (రాక్షస బాధను తొలగించే సామర్థ్యం కలిగినది), పావని (పవిత్ర చేసేది), శూలఘ్నీ (శూలను లేదా నొప్పిని తగ్గించేది)... ఈ పేర్లన్నీ తులసి గుణ ధర్మాలను స్పష్టం చేస్తాయి. * తులసి మొక్కలో ఆకులకు, వేర్లకు, గింజలకు ఔషధ తత్వాలు ఉన్నాయి. * తులసి స్వరసాన్ని 10-20మి.లీ. (2-4 టీ స్పూన్లు) మోతాదులోనూ, వేరు కషాయాన్ని 50-100 మి.లీ. (అర కప్పు- ఒక కప్పు) మోతాదులోనూ, చూర్ణాన్ని 3-6 (గ్రాముల (అర టీ స్పూన్- టీ స్పూన్) మోతాదులోనూ వాడాలి.

 గృహ చికిత్సలు
 • ఆంత్రకృమి--తులసి ఆకులను, గింజలను ఎండబెట్టి, పొడిచేసి అర చెంచాడు మోతాదుగా చెంచాడు తేనెతో కలిపి తీసుకోవాలి. 
 • అజీర్ణం--తెల్ల తులసి వేరును, శొంఠిని నలగ్గొట్టి నీళ్లలో వేసి కషాయం కాచి తీసుకుంటే వెంటనే అజీర్ణం తగ్గుతుంది. 
 • గాయం, దెబ్బలు---గాయంమీద వాలిన ఈగలను, గాయం మీద పేరుకున్న ఈగల గుడ్లను తొలగించడానికి తులసి గింజలను, వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి లేపనం చేయాలి. వ్రణం--తులసి ఆకులు, ఉమ్మెత్తాకులు, నల్లతుమ్మ పట్ట... వీటిని దంచి నీళ్లలోవేసి కషాయం తయారుచేసి గాయాన్ని కడిగితే త్వరగా మానుతుంది. 
 • చెవి నొప్పి--తులసి గింజలతో తైలపాక విధానంలో తైలన్ని తయారుచేయాలి. (1 భాగం గింజల, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది) దీనిని కొద్దిగా వేడిచేసి చెవుల్లో డ్రాప్స్‌గా వేసుకుంటే చెవి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. 
 • కంటి వ్యాధులు (కళ్లకలక)--తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి కళ్లకు అంజనంగా(కాటుకగా) వాడితే కళ్లకలక తగ్గుతుంది. 
 • దగ్గు--కృష్ణ తులసి ఆకుల రసాన్ని 2 చెంచాలు మోతాదులో చెంచాడు తేనెతో కలిపి తీసుకుంటే కఫంతోకూడిన దగ్గు తగ్గుతుంది. 
 • చలి జ్వరం (మలేరియా)--తులసి ఆకుల రసం నాలుగు టీస్పూన్లూ, మిరియం పొడి పావు చెంచాడూ కలిపి తీసుకుంటే చలి జ్వరం దిగుతుంది. 
 • తలలో విషం చేరితే--కృష్ణ తులసి గింజల పొడిని ముక్కుపొడుము మాదిరిగా పీల్చితే తలలో సంచితమైన విష పదార్థాల తీవ్రత తగ్గుతుంది. 
 • ప్రసవానంతర నొప్పులు (మక్కల్ల శూల)--తులసి ఆకుల రసాన్ని చెంచాడు మోతాదులో పాత బెల్లం, ద్రాక్షతో తయారైన మద్యంతో (ద్రాక్షాసవంతో) కలిపి తీసుకుంటే ప్రసవానంతరం ఇబ్బందిపెట్టే నొప్పి తగ్గుతుంది. 
 • పిల్లల్లో కనిపించే దగ్గు, జలుబులు---తులసి ఆకులు, లవంగ మొగ్గలు, పొంగించిన వెలిగారం (టంకణం/ బొరాక్స్/ బోరిక్ పౌడర్)... వీటిని మూడింటిని సమసమ భాగాలు తీసుకొని మెత్తగా నూరి పావుచెంచాడు మోతాదులో ఇస్తే చిన్న పిల్లలకు వచ్చే జ్వరం, దగ్గు, ఉబ్బసం, కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి. 
 • దద్దుర్లు--తులసి ఆకుల రసాన్ని స్థానికంగా ప్రయోగిస్తే దద్దుర్లు తగ్గుతాయి. 
 • మానసిక ఒత్తిడి--ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తులసి ఎడాప్టోజెన్‌గాను, యాంటీస్ట్రెస్‌గా పనిచేస్తుందని తేలింది. ప్రతినిత్యం ఉదయసాయంకాలాలు 10 తులసీ దళాలను నమిలి తింటుంటే మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. 
 • కాలేయ సమస్యలు--10-15 తులసి ఆకులను వేడి నీళ్లలో కడిగి ప్రతిరోజూ ఉదయం పూట తిని ఒక గ్లాసు వేడినీళ్లు తాగితే కాలేయం సమస్యల్లో హితకరంగా ఉంటుంది. 
 • చర్మవ్యాధులు--చర్మవ్యాధులు మొండిగా మారిపోయి ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి ఆకులను దంచి రసం పిండి 2-4 టీ స్పూన్ల మోతాదులో ప్రతినిత్యం ఉదయం పూట తీసుకోవాలి. 
 • దద్దుర్లు, గౌట్ నొప్పి--తులసి ఆకులను నిమ్మ రసంతో సహా నూరి దద్దుర్లు, గౌట్ వ్యాధివల్ల వచ్చే నొప్పి, చర్మవ్యాధి వంటి వాటిమీద బాహ్యంగా ప్రయోగిస్తే లాభప్రదంగా ఉంటుంది. 
 • తులసి ఆకులను గుప్పెడు తీసుకొని నీళ్లకు వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవ లవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది. జిగట విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. 
 • తులసి ఆకుల స్వరసం, సున్నం రాయి, ఆవునెయ్యి... వీటిని అన్నిటినీ కలిపి నూరి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. 
 • 20 గ్రాముల తులసి గింజల పొడికి 40గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి మెత్తగా నూరి నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్రాము మోతాదులో రోజువారీగా తీసుకుంటే దుర్భలత్వం దూరమవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి జలుబులు చేయకుండా ఉంటాయి.
 •  తులసి గింజల చూర్ణాన్ని లేదా ముద్దను పావు టీస్పూన్ మోతాదులో కప్పు పాలకు కలిపి ఇస్తే పిల్లల్లో కడుపు ఉబ్బరింపు, పొట్ట నొప్పి వంటివి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. 
 • తులసి పూగుత్తిని నీడలో ఆరబెట్టి పొడిచేసి పావు చెంచాడు మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే శిరోవ్యాధుల్లో ఉపశమనంగా ఉంటాయి. 
 • తులసి గింజలను పొడిచేసి గోరువెచ్చని నీళ్లతో కలిపి ముఖంమీద లేపనం చేసుకుంటే సైనస్‌లోని ఒత్తిడి తగ్గి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. 
 • తులసి ఆకుల రసాన్ని వేడి చేసి, గోరువెచ్చని స్థితిలో చెవుల్లో బిందువులుగా వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. తులసి ఆకులను 5 చొప్పున ప్రతిరోజూ నీళ్లతో తీసుకుంటే ఆందోళన తగ్గి మనోశక్తి వికసిస్తుంది. తులసి ఆకులతో తయారుచేసుకున్న తైలాన్ని (1 భాగం తులసి ఆకులు, 4 భాగాలు నువ్వుల నూనె, 16 భాగాలు నీళ్లు తీసుకొని కలిపి నీరంతా ఆవిరయ్యేవరకూ చిన్న మంటమీద మరిగిస్తే సిద్ధతైలం తయారవుతుంది). ముక్కు రంధ్రాల్లో నస్యంగా వేసుకుంటుంటే ఎక్కువ కాలం నుంచి బాధించే మొండి తలనొప్పి దూరమవుతుంది. తులసి నూనెను తలకు రాసుకుంటే పేలు నశిస్తాయి. 
 • తులసితో చేసిన తైలాన్ని ముఖంమీద ప్రయోగించి రుద్దితే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోయి ముఖం తేటగా ప్రకాశిస్తుంది. 
 • తులసి ఆకులను, నల్లమిరియాలను మెత్తగా నూరి, ఉండచేసి పంటి కింద ఉంచుకుంటే దంతాల నొప్పి తగ్గుతుంది. 
 • తులసి ఆకుల పొడికి ఆవనూనె కలిపి చిగుళ్లను, దంతాలను శుభ్రపరచుకుంటే చిగుళ్లనుంచి చీముకారడం, నోటి దుర్వాసన వంటివి తగ్గుతాయి. 
 • తులసి కషాయాన్ని చందనం పేస్టుతో కలిపి నుదుటికి లేపనం చేసుకుంటే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి ఆకుల పొడిని చిటికెడు మోతాదులో ముక్కుపొడుం మాదిరిగా పీల్చాలి. 
 • తులసి ఆకులను (10-12), లవంగ మొగ్గలను (4), శొంఠి పొడిని (టీస్పూన్) కలిపి మెత్తని ముద్దగా నుదుటి మీద పట్టువేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. 
 • ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 20 తులసి ఆకులను తిని గ్లాసు నీళ్లు తాగుతుంటే శరీర దుర్గంధం తగ్గుతుంది. తులసి ఆకుల రసాన్ని గోరువెచ్చని నీళ్లకు కలిపి గొంతు తగిలేలా పుక్కిట పడితే గొంతులో అసౌకర్యం తగ్గుతుంది. 
 • తులసి ఆకుల రసం కలిపిన నీళ్లకు పసుపును, సైంధవ లవణాన్ని కలిపి పుక్కిట పడితే దంతాలు, చిగుళ్లు, నాలుక, గొంతులకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. 
 • తులసి మొక్క పంచాంగ చూర్ణాన్ని, కందగడ్డ చూర్ణాన్ని కలిపి నిల్వచేసుకోవాలి. దీనిని 250 మి.గ్రా. మోతాదులో తమలపాకు మధ్య పెట్టుకొని తింటే పురుషుల్లో పుంస్త్వశక్తి పెరుగుతుంది. 
 • తులసి ఆకుల రసాన్ని వైద్య పర్యవేక్షణలో కళ్లలో చుక్కలుగా వేసుకుంటుంటే రేచీకటిలో హితకరంగా ఉంటుంది. 
 • తులసి ఆకులను లేదా పూలగుత్తిని నలిపి వాసన చూస్తే సూక్ష్మక్రిములు నశించి జలుబునుంచి ఉపశమనం లభిస్తుంది. 
 • తులసి ఆకుల రసం, చిన్న ఏలక్కాయ గింజల పొడి, అల్లం రసాలను కలిపి తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి.

 • డా. చిరుమామిళ్ల మురళీమనోహర్, ఎం.డి. ఆయుర్వేద 
రోగనిరోధక శక్తి పెంచే పంచతులసి

 శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ‘పంచ తులసి’ ఇప్పుడు మరింత ఆకర్షణీయ ప్యాక్‌లో లభిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే వెైరల్‌ ఇన్‌ ఫెక్షన్స్‌, దగ్గు, జలుబు, విషజ్వరాలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుంచి ఇది రక్షణ కల్పి స్తుంది. దీర్ఘకాలంగా మధు మేహంతో, రక్తపోటుతో బాధపడుతున్న వారికి పంచ తులసి ఉపశమనం అం దించడంతో పాటు వ్యాధి పెరగకుండా ఉండేందుకు, రక్తశుద్ధికి దోహదపడు తుందని సంస్థ పేర్కొంది. దీన్ని నీటిలో కలుపుట వలన నీరు పరిశుభ్రం కావడంతో పాటు నీటిలో ఉన్న సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయి. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ట్యూబర్‌కులోసిస్‌గా కూడా ఉపయోగపడుతుంది. తాగే ప్రతిసారి గ్లాసు నీటిలో ఒక చుక్క పంచతులసి కలిపి తాగడం వల్ల కుటుంబమంతటికీ రోగనిరోధక శక్తి పెంపొందించి రక్షణ కల్పిస్తుంది. అన్ని కాలాల్లోనూ దీన్ని వాడవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పద్మావతి ఫార్మస్యూటికల్స్‌ (హరిద్వార్‌) తయారు చేస్తున్న ‘పంచతులసి’ని రిచ్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ (ముంబయి) మార్కెటింగ్‌ చేస్తోంది.
 • =========================================

1 comment:

 1. ITS REALLY USEFUL TO ALL OF US Dr.Seshagirirao-MBBS GARU IS TAKING LOT OF INTEREST IN ANSWERING VARIOUS HEALTH PROBLEMS AND HIS VALUABLE AD VISE'S TO READERS,ESPECIALLY I AM VERY MUCH PROUD OF HIM, AS HE IS FROM SRIKAKULAM ,ITS OUR BIRTH PLACE ,THANKS
  JILLUDUMUDI

  ReplyDelete