Saturday, December 25, 2010

Fenugreek(Mentulu),మెంతులు

 • పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, తృణదాన్యాలు , సుగందద్రవ్యాలు ,కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు.
ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. మెంతి ఆకుల ఔషధ గుణాలు
 • *‌ ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
 • *‌ పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
 • *‌ కామెర్ల వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం)తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
 • *‌ ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
 • *‌ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
 • *‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
 • *‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
 • కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి.
 • వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.
మెంతి గింజలు
 • *‌ రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
 • *‌ నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
 • *‌ కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
 • *‌ పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
 • *‌ మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
 • *‌ మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
 • *‌ మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.
100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు
 • పిండిపదార్థాలు 44.1 శాతం
 • ప్రోటీన్లు 26.2 శాతం
 • కొవ్వు పదార్థాలు 5.8 శాతం
 • ఖనిజ లవణాలు 3 శాతం
 • పీచు పదార్థం 7.2 శాతం
 • తేమ 13.7 శాతం
కాల్షియం, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మెంతి ఆకుల్లో ఏ విటమిన్‌ అధికంగా ఉంటుంది.
 • 100 గ్రాముల ఆకుల్లో పోషక విలువలు
 • పిండి పదార్థాలు 60 శాతం
 • ప్రోటీన్లు 4.4 శాతం
 • కొవ్వు పదార్థాలు 1 శాతం
 • ఖనిజ లవణాలు 1.5 శాతం
 • పీచు పదార్థం 1.2 శాతం
మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. Courtesy with --డా|| పెద్ది రమాదేవి ,ఆయుర్వేదిక్‌ ఫిజిషియన్‌, సురక్ష ఆయుర్వేదిక్‌ క్లినిక్‌, హైదరాబాద్‌.
 • ---------------------------------------------------------------------------
మెంతులు - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
 • మెంతులు మనందరికీ తెలిసిన ఔషధ దినుసు. ఇది శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే ఒక చక్కని ఓషధి. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. మెంతులు మలబద్ధకం, అధిక కొలెస్టరాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ప్రత్యేకమైన వాసన, శరీరాన్ని పోషించే తత్వం ఈ లక్షణాల వల్ల ఇది అతి ప్రభావవంతమైన, విలువైన ఓషధిగా ప్రసిద్ధి గాంచింది.
 • మెంతి మొక్క ఒకే ఏడాదిలో జీవిత చక్రాన్ని ముగించేసుకునే ఏకవార్షిక మొక్కగా పెరుగుతుంది. దీనిని పెరటి మొక్కగానే కాకుండా రోజువారీగా వంటల్లో వాడుకోవటం కోసం సాగు చేస్తుంటారు కూడా. ముఖ్యంగా మెంతి ఆకులను రుచికరమైన కూరగా వాడుకోవటం మన దేశంలో సర్వత్రా కనిపిస్తుంటుంది. మెంతులు శరీరం లోపలకు ప్రవేశించిన తరువాత ఇది స్వేదం ద్వారా ప్రత్యేకమైన వాసనతో బహిర్గతమవుతుంది. మెంతులు అతి ప్రసిద్ధి గాంచిన చతుర్భీజాల్లో ఒకటి. మెంతులు, చంద్రశూర, నల్లజీలకర్ర, వాము ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తాయి.
ఆయుర్వేద గుణకర్మలు
 • దీపన (ఆకలిని పెంచుతుంది) పాచన (అరుగుదలను పెంచుతుంది) అనులోమన (వాతాన్ని కిందకి కదిలేట్లు చేస్తుంది) విరేచన (మలవిసర్జన సజావుగా జరిగేలా చేస్తుంది) వాతకఫఘ్న (వాతాన్ని కఫాన్ని తగ్గిస్తుంది) ప్రమేహఘ్న (మధుమేహాన్ని నియంత్రిస్తుంది)
 • పరిశోధనలో తేలిన గుణకర్మలు
 • కార్మినేటివ్ (ఆకలిని పెంచుతుంది) కొలెస్ట్రోలిమిక్ (కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది) బల్క్‌ల్యాగ్జిటివ్ (మలాన్ని తయారయ్యేలా చేస్తుంది) యాంటీ డయాబెటిక్ (మధుమేహాన్ని తగ్గిస్తుంది) డెముల్సెంట్ (జారుడు గుణాన్ని కలిగిస్తుంది) ఎక్స్‌పెక్టోరెంట్ (కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది) డయూరిటిక్ (మూత్రాన్ని జారీ చేస్తుంది) డయాఫోరిటిక్ (చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరుస్తుంది) యాఫ్రోడైజియాక్ (కామశక్తిని పెంచుతుంది)
ప్రత్యేకతలు
 • మధుమేహం: ఇది మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మధుమేహ నియంత్రణ శక్తిని వినియోగించుకోవచ్చు. ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని పోషించే కొవ్వు మేటలను ఇది శుభ్రం చేస్తుంది. మెంతులు టైప్ 1, టైప్ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి. మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.
 • కొలెస్టరాల్: మెంతులు మేదోవహ స్రోతస్సు మీద నేరుగా పని చేయటం వల్ల దీనిని కొలెస్టరాల్‌ని తగ్గించుకోవడానికి ఔషధంగా వాడుకోవచ్చు. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లకు లేదా వెన్న తీసిన మజ్జిగకు కలిపి తీసుకుంటూ ఉంటే ప్రమాదకరమైన లోడెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్) తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది.
 • జీర్ణశక్తి: కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది. మెంతులు నీళ్ల విరేచనాలను, అలాగే పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో తయారైన అల్సర్లని తగ్గించడంతోపాటు మలం విచ్చుకొని తయారయ్యేలా చేస్తుంది. అందుకే ఇది సౌమ్యమైన విరేచనకారిగా పని చేస్తుంది. మెంతుల్లోని చేదు తత్వాలు కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. అలాగే పోషక తత్వాల విలీనానికి సహాయపడతాయని అధ్యయనాల్లో తేలింది.
 • మహిళల సమస్యలు: గర్భాశయ వ్యాధుల్లోనూ, ఇతర స్ర్తిల వ్యాధుల్లోనూ, పునరుత్పత్తికి చెందిన అంగ ప్రత్యంగాల సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో ఉండే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు - డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తరువాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలో సంచితమైన రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. రసధాతువు మీద మెంతుల్లోని పోషకాంశాలు పని చేయటం వల్ల తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది. నొప్పితో కూడిన బహిష్టులో ఇది వేడిని ఉత్పన్నం చేయటం ద్వారా రక్తప్రసరణను పెంచి దోష సంచితాన్ని తగ్గిస్తుంది.
 • మగవాళ్ల ప్రత్యేక సమస్యలు: మెంతుల్లోని ప్రత్యేక తత్వాలు శీఘ్రస్కలనం, నపుంశకత, లైంగిక స్తబ్దత, అంగస్తంభన సమస్యలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి. దీనిలోని పోషక తత్వాలు పునరుత్పత్తి వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. అలాగే దీనిలోని మధుర తత్వాలు శుక్రధాతువు తయారీకి సహాయపడతాయి.
 • నొప్పి: మెంతులు వాతహరంగా పని చేస్తుంది కాబట్టి దీనిని నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి ఇలాంటి వాటిల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా నడుములో, తొడల్లో, రక్తప్రసరణ తగ్గటం వల్ల ఏర్పడిన చల్లదనాన్ని ఇది అమోఘంగా తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది. అస్త్ధితువును (ఎముకలు) ఇది శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్, నడుమునొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది.
 • బాహ్య ప్రయోగం: మెంతులను నీళ్లతో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇనె్ఫక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి.

 • మెంతులతో మేలు!
మెంతులు రుచిలో చేదుగా ఉన్నా చక్కని సువాసనతో ఔషధగుణాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. దీనిలో అధిక మోతాదులో మినరల్స్‌, విటమిన్లు, ఫైటోన్యూట్రియంట్స్‌ లభిస్తాయి. వందగ్రాముల మెంతుల్లో మూడువందల ఇరవై మూడు కెలొరీలు ఉంటాయి. శరీరంలో త్వరగా కరిగేపోయే పీచు దీనిలో ఎక్కువగా లభిస్తుంది. దీనిలో ఉండే కాంపౌడ్స్‌ అయిన మ్యుకిలేజ్‌, టానిన్‌, హెమీసెల్యులోజ్‌, పెక్టిన్‌ వంటివి రక్తంలోని ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి వూపిరితిత్తుల క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. అలానే దీనిలో లభించే నాన్‌స్టార్చ్‌ పోలీశాచిరైడ్స్‌ జీర్ణప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది.
 • =============================
Visit my Website - Dr.Seshagirirao

3 comments:

 1. chala manchi vishayalu cheparu...meku dhanyavadalu sir...

  ReplyDelete
 2. Menthulatho...inni..prayojanaalinnayani ...baaga chepparu sir thank u sir

  ReplyDelete
 3. Menthulatho...inni..prayojanaalinnayani ...baaga chepparu sir thank u sir

  ReplyDelete