నాజూగ్గామారేందుకు...బరువెక్కకుండా ఆహారపు అవవాట్లు :
కొన్ని రకాల పదార్థాలు మానేసి... మరికొన్నింటిని తీసుకుంటే సన్నబడటం సులువే. అయితే దాంతోపాటూ చేసుకోవాల్సిన మార్పులూ మరికొన్ని ఉన్నాయి. పొద్దున టిఫిన్, రెండుపూటల భోజనం... ఇంతేగా అనుకుంటే చాలదు. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. శరీరం ఇన్సులిన్‌ని తక్కువగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. అదే ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా బరువూ అదుపులో ఉంటుంది.
కప్పు నిండా ఐస్‌క్రీం, పైన నాలుగైదు రకాల పండ్ల ముక్కలతో తినే అలవాటు తగ్గించుకోండి. బదులుగా కప్పునిండా పండ్లముక్కలు తీసుకుని దానిపైన చెంచా ఐస్‌క్రీం వేసుకోండి. సలాడ్‌పై చాలా కొద్దిగా చీజ్ వేసుకోవడం లాంటివన్నీ కెలొరీలు తగ్గించే ప్రత్యామ్నాయాలే. పొద్దుటిపూట తిఫిన్ తిన్నాక ఓ గ్లాసు బత్తాయీ, కమలాఫలం రసం తాగండి. వాటివల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దాంతో అదేపనిగా ఎక్కువగా తినడం జరగదు.
ఆకలితో సంబంధం లేకుండా, మీ ముందు ఎంత ఎక్కువ ఆహారం ఉంటే అంత ఎక్కువగా తినేస్తారని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. దీన్ని అధిగమించాలంటే చిన్న పళ్లెం తీసుకొని, కొద్దిగానే వడ్డించుకోవాలి. దానివల్ల తెలియకుండానే తక్కువగా తీసుకుంటాం. కాఫీ, టీలు తాగే గ్లాసులకీ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే, అన్నం ఒక్కటే కాదు, టిఫిన్, స్నాక్స్ ఏవయినా సరే... భోజనాల బల్ల దగ్గరే తినాలనే నియమాన్ని పెట్టుకోండి. ఫలితంగా టీవీ, కంప్యూటరు ముందు కూర్చుని తినే అలవాటు తప్పుతుంది. నోరూరించే పదార్థాలు ఎన్ని చేసుకున్నా సరే... పచ్చి కూరగాయ ముక్కలు కూడా మీ ముందు ఉండేలా చూసుకోవాలి. ముందు వాటిని తిన్నాకే ఇతర పదార్థాలను తినాలనే నియమాన్ని పెట్టుకోవాలి. దానివల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. కెలొరీలూ తగ్గుతాయి.
- ===================
No comments:
Post a Comment