Friday, July 2, 2010

పుచ్చకాయ , Melon guard


ప్రకృతి ప్రసాదించిన అద్భుతాల్లో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయను కేవలం దప్పికను తీర్చుకోవడానికే కాకుండా అనేక రకాల అనారోగ్యాల్లో ఔషధంగా వాడుకోవచ్చు.

  • * పుచ్చకాయలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ తక్కువ. కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ అసలు ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ. సోడియం తక్కువ. విటమిన్లలో విటమిన్-ఎ, ఫోలేట్, విటమిన్-సిలు ఎక్కువ. 
  • * ఒక మాట. పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు గాని, లేదా పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు గాని పుచ్చకాయను పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే, పుచ్చకాయలో ఇవి రెండూ ఎక్కువ. 
  • * పుచ్చకాయ మనిషికి పూర్వకాలంనుంచి తెలుసు. ఆఫ్రికా దేశంలోని కలహారి ఎడారి ప్రాంతంనుంచి పుచ్చకాయ ప్రపంచ దేశాలకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు. కాగా ఐదువేల సంవత్సరాల క్రితం ఈజిప్టులో పుచ్చకాయను పండించినట్లు ఆధారాలున్నాయి. ప్రస్తుతం చైనా దేశం ప్రపంచంలో అత్యధికంగా పుచ్చకాయను పండిస్తోంది. 
  • * పుచ్చకాయ అనేక రీతుల్లో లభ్యమవుతుంది. పొడుగువి, గుండ్రనివి, గింజలు కలిగినవి, గింజలు లేనివి, ఎర్రని గుజ్జు కలిగినవి, పసుపు రంగు గుజ్జు కలిగినవి... ఇలాగ. ఇటీవల కాలంలో జపాన్‌లో నలు చదరంగా, త్రిభుజాకారంగా ఉండే పుచ్చకాయలను కూడా పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాల్లో 1,200 రకాలకు పైగా పుచ్చకాయలను సాగుచేస్తున్నారు. మన దేశంలో ఎంతోమందికి పుచ్చకాయ జీవనోపాధిని కల్గిస్తోంది. 
  • * పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. అందుకే దీనిని ఇంగ్లీషులో ‘వాటర్’మిలన్ అంటారు. పుచ్చకాయను శాస్ర్తియ భాషలో ‘సిట్రులస్ లానేటస్’ అంటారు. కుకుర్బిటేసి వంశానికి చెందినది. గుమ్మడి, దోస మొదలైన పండ్లను పోలి ఉంటుంది. 
  • * సాధారణంగా పుచ్చకాయను యథాతథంగా ముక్కలు కోసి వాడుతుంటారు. ఐస్‌క్రీమ్ తీసే స్కూప్‌తో గుండ్రని బంతుల రూపంలో గుజ్జును తీసి ఆకర్షణీయంగా సర్వ్ చేస్తుంటారు కొంతమంది. పచ్చి పుచ్చకాయను ఎండాకాలం స్క్వాష్ తయారీకి వాడతారు. పుచ్చకాయ గింజలను రోస్ట్‌చేసి తినవచ్చు. వీటికి ఉప్పుచేర్చి పొడి చేసుకుని గాని, రొట్టె మాదిరిగా తయారుచేసుకుని గాని వాడుకుంటారు మరికొంతమంది. పుచ్చకాయ వెలువలి తొక్క భాగాన్ని పారేయకుండా పచ్చడి చేసుకుని తినటం అక్కడక్కడా కనిపిస్తుంది. 
  • * పుచ్చకాయలో కొవ్వు, కొలెస్టరాల్ వంటివి ఉండవు. విటమిన్-ఎ, బి6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పీచు పదార్థం, పొటాషియం అధిక మొత్తాల్లో ఉంటాయి. విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి అవసరం. విటమిన్-బి6 మెదడులో సెరటోనిన్, మెలటోనిన్, డోపమిన్ వంటి న్యూరోట్రాన్సిమిటర్స్ విడుదలవ్వటానికి తోడ్పడుతుంది. ఈ న్యూరోట్రాన్సిమిటర్స్‌వల్ల ఆందోళన, చిరాకు వంటివి తగ్గుతాయి. విటమిన్-సి వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇనె్ఫక్షన్లు దాడి చేయకుండా ఉంటాయి. పొటాషియం అనేది శరీరంలో ఉండే నీటి మొత్తాలను అదుపుచేస్తుంది. ఇది లోపిస్తే కండరాల నొప్పి అనుభవమవుతుంది. 
  • * పుచ్చకాయలో ఎరుపు రంగుకు కారణమైన లైకోపీన్ అనే కెరటినాయిడ్ పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్లను రానివ్వకుండా కాపాడటమే కాకుండా గుండె జబ్బులను, మ్యాక్యులర్ డీజెనరేషన్‌ను (కంటిలోపలి పొర క్షీణించి పోవటం) సైతం నిరోధిస్తుంది. లైకోపీన్ అనేది టమాట, ఎర్రజామ, ఎర్రద్రాక్ష వంటి పండ్లలో ఉన్నప్పటికీ పుచ్చకాయలో అత్యధిక మొత్తాల్లో ఉంటుంది. (రెండు కప్పులు పుచ్చకాయ ముక్కల్లో 18 మి.గ్రా. ఉంటే ఒక మోస్తరులావున్న టమాటాలో కేవలం 4 మిల్లీగ్రాములే ఉంటుంది.) శరీరాంతర్గతంగా అనిశ్చితంగా కదులుతూ ఆరోగ్యవంతమైన కణాలపైన దాడి చేసి క్యాన్సర్, కణాల క్షీణతకి (డీజనరేషన్) కారణమయ్యే ప్రీర్యాడికల్స్‌ని పుచ్చకాయలో ఉండే లైకోపీన్ తటస్త పరుస్తుంది. 
  • * చూడ్డానికి పుచ్చకాయ గట్టిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ చాలా పెళుసుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రవాణా చేయాలి. కాయ అడుగు భాగంలో వెన్న మాదిరి రంగులో తెల్లని మచ్చ కనిపిస్తే పక్వానికి వచ్చిందని అర్థం. పండిన పుచ్చకాయను బాగా కదిలిస్తే లోపలుండే గింజలు కదిలి శబ్దం వస్తుంది. సహజంగా పండినప్పుడు అడుగు భాగంలో తెల్లగా కనిపిస్తుంది. బయట తోపుడు బండ్లమీద పుచ్చకాయ ముక్కలను కొనాలనుకున్నప్పుడు కాంతివంతంగా, చక్కని తాజా ఎరుపు రంగులో ఉండి, తెల్లని చారికలు లేని వాటిని ఎంచుకోవాలి. 
  • * పుచ్చకాయను గుండ్రంగా, సమానంగా ఉన్నదానిని, రాయి దెబ్బ తగలని దానిని ఎంచుకోవాలి. ఎంత బరువుగా ఉంటే అంత మంచిది. పుచ్చకాయను తినాలనుకున్నప్పుడు ముందుగా సగానికి కోసి తరువాత త్రిభుజాకారంలో కోయాలి. ఫోర్క్ సహాయంతో గింజలను తొలగించి వాడుకోవాలి. పచ్చిగా ఉన్న పుచ్చకాయను సాధారణ గది ఉష్ణోగ్రతవద్ద ఉంచితే పండుతుంది. పండిన తరువాత కొద్దికాలంపాటు నిల్వచేసుకోదలిస్తే ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒకవేళ ముక్కలుగా కోసిన తరువాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోదలిస్తే కోసిన వెంటనే పాలీథిన్ కాగితం చుట్టినా గాలి చొరపడని ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టినా 3-4రోజుల వరకూ తాజాగా ఉంటాయి. 

ఔషధోపయోగాలు 
  • * క్యాన్సర్ నివారణకోసం పుచ్చకాయను వాడుకోవచ్చు. పుచ్చకాయలో బీటాకెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది కాబట్టి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరి తిత్తుల క్యాన్సర్లను, స్వరపేటిక క్యాన్సర్లను పుచ్చకాయలోని బీటా కెరోటిన్ గణనీయంగా నిరోధించినట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదికల్లో ప్రచురించింది. మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ఇదే బీటాకెరోటిన్ పదార్థాన్ని సప్లిమెంట్ల రూపంలో వాడినప్పుడు ఈ ప్రయోజనం కనిపించలేదు. 
  • * గుండెపోటు రిస్కును పుచ్చకాయతో తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌వల్ల, విటమిన్ -బి6వల్ల మహిళల్లో గుండె పోటు సంఘటనలు దాదాపు 50శాతం తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. 
  • * జన్మతఃప్రాప్తించే అవలక్షణాలు కూడా పుచ్చకాయను తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో తల్లులకు ఆహారంలో పుచ్చకాయను ఇచ్చిన సందర్భాల్లో వారికి పుట్టిన పసి పాపాయిల్లో గ్రహణం మొర్రి వంటి జన్మతః ప్రాప్తించే సమస్యలు చాలా తక్కువగా కనిపించినట్లు పరిశోధన. పుచ్చకాయలో ఉండే ఫోలేట్‌కి జన్మతః ప్రాప్తించే సమస్యలను నిరోధించగలిగే శక్తి ఉంది. 
  • * పుచ్చకాయలో అధిక మొత్తాల్లో పోటాషియం ఉంటుంది కాబట్టి మూత్రం జారీ అవ్వటంకోసం వాడుకోవచ్చు. ముఖ్యంగా మూత్ర మార్గంలో రాళ్లు తయారైనప్పుడు, నిర్జలీయత ప్రాప్తించి మూత్రం గాఢంగా తయారైనప్పుడు, మధుమేహం వంటి వ్యాధుల్లో ఆమ్లత్వం (మెటబాలిక్ ఎసిడోసిస్) పెరిగినప్పుడు పుచ్చకాయను వాడితే ఎంతో మేలు జరుగుతుంది. 
  • * గుండెకు సంబంధించిన వ్యాధులు, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యల్లో సోడియం సంచితమై శరీరంలో నీరు చేరుకున్నప్పుడు నిరపాయకరంగా వెలువరించడానికి పుచ్చకాయ సహాయపడుతుంది. కాకపోతే యురీమియా వంటివి ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకోవటం తప్పనిసరి. 
  • * ఎండాకాలంలో ఉక్కపోతవల్ల స్వేదంతోపాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. దీనిని పుచ్చకాయతో తీర్చుకోవచ్చు. 
  • * విరేచనాలు, గ్యాస్ట్రో, బంక విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యల్లో నిర్జలీయత ప్రాప్తించి బాగా నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పుచ్చకాయను ముక్కలుగా కోసి తినవచ్చు. లేదా రసం తీసి గ్లూకోజ్ పొడి, తేనె లేదా నిమ్మ రసం వంటివి చేర్చి తీసుకోవచ్చు. 
 పుచ్చకాయతో హాయి

  • వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయలు శరీరానికి చల్లదనాన్నే కాదు చర్మాన్నీ తాజాగా ఉంచుతాయి.
  • * చర్మంపె మచ్చలు, ,సన్నని ముడతలు కనిపిస్తోంటే.. పుచ్చకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజూ రాత్రిళ్లు ముఖానికి రాసుకోవాలి. మర్నాడు కడిగేసుకుంటే సమస్య తగ్గి ముఖం తాజాగా కనిపిస్తుంది.
  • * చిన్న పుచ్చకాయ ముక్కని ముఖానికి రాసుకుంటే.. అది చర్మగంథ్రుల్లోకి చొచ్చుకుపోయి మురికిని శుభ్రం చేస్తుంది. పుచ్చకాయ రసంలో కొద్దిగా పుదీనా రసం ఫ్రిజ్‌లో ఉంచి రాసుకున్నా.. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
  • * ఎండలో తిరిగి రావడం వల్ల చర్మంపై వేడి ప్రభావం మాత్రమే కాదు, దుమ్మూధూళీ కూడా చేరుతుంది. ఇలాంటప్పుడు ఇంటికొచ్చాక పుచ్చకాయ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది టోనర్‌లా పనిచేసి మురికిని తొలగిస్తుంది.
 
  • ==================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment