Monday, August 10, 2009

బంగాళా దుంప ,potato


  • బంగాళదుంప (Potato) అనేది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఒక్కో ప్రాంతములో ఒక్కోక పేరుతో ఈ దుంప కూర పిలవబడుతున్నది. కొన్ని చోట్ల ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ అని మరికొన్ని ప్రాంతములలో బంగాళదుంప అని పిలుస్తారు. ఈ మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన గుల్మము.
పౌష్టిక విలువలు
  • ఆహార పౌష్టికత పరంగా బంగాళదుంపలలో పిండి పదార్ధాలు (కార్బోహైడ్రేటులు) ప్రధానమైన ఆహార పదార్ధం. ఒక మధ్య రకం సైజు దుంపలో 26 గ్రాములు పిండిపదార్ధం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఈ స్టార్చి‌లో కొద్ది భాగం పొట్టలోను, చిన్న ప్రేవులలోను స్రవించే ఎంజైములు వలన జీర్ణం కాదు. కనుక ఈ జీర్ణం కాని స్టార్చి భాగం పెద్ద ప్రేవులోకి తిన్నగా వెళ్ళిపోతుంది. ఈ జీర్ణం కాని స్టార్చి (resistant starch) వలన శరీరానికి ఆహార పీచు పదార్ధాలు (Dietary fiber) వల్ల కలిగే ఉపయోగాలవంటి ప్రయోజనాలే కలుగుతాయని భావిస్తున్నారు
  • శరీర పౌష్టికత,
  • కోలన్ క్యాన్సర్ నుండి భద్రత,
  • గ్లూకోజ్ ఆధిక్యతను తట్టుకొనే శక్తి,
  • కొలెస్టరాల్ తగ్గింపు,
  • ట్రైగ్లిజరైడులు తగ్గింపు వంటివి.
  • దుంపను ఉడకపెట్టి ఆరబెడితే ఇలా జీర్ణంకాని స్టార్చి ఎక్కువవుతుంది. ఉడికిన వేడి దుంపలో ఉండే 7% జీర్ణంకాని స్టార్చి, దానిని ఆరబెట్టినపుడు 13%కు పెరుగుతుంది.
బంగాళ దుంపలలో పలువిధాలైన విటమిన్‌లు, ఖనిజ లవణాలు (minerals) ఉన్నాయి. 150 గ్రాముల బరువుండే ఒక మాదిరి బంగాళ దుంపలో 
  • 27 మిల్లీగ్రాముల విటమిన్-సి (ఒక రోజు అవుసరంలో 45%), 
  • 620 మి.గ్రా. పొటాషియం ( అవుసరంలో 18%), 
  • 0.2 మి.గ్రా. విటమిన్-B6 (అవుసరంలో 10%) మాత్రమే కాకుండా 
  • కొద్ది మోతాదులలో థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు లభిస్తాయి. 
  • ఇంతే కాకుండా బంగాళదుంప తొక్కలో ఉన్న పీచు పదార్ధం కూడా చాలా ఉపయోగకరం. ఒక మాదిరి బంగాళ దుంప తొక్క బరువు 2 గ్రాములు ఉంటుంది. ఇందులో ఉన్న పీచు ఎన్నో ధాన్యపు గింజల ద్వారా వచ్చే పీచుకు సమానం. 
  • ఇంకా బంగాళదుంపలో కార్టినాయిడ్స్ మరియు పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. 
బంగాళ దుంపలో లభించే ఇన్ని పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై బాగా ఆధారపడి ఉంటుంది.

అందానికి బంగాళాదుంప :

    బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది.

కళ్లకి మెరుపు : ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.

ముడతలు పోయేలా : బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.

చక్కని ఛాయకి : బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. .

ఫేస్‌మాస్క్‌లు : ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరవాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరవాత శుభ్రపరుచుకోండి.
  • =====================

 visit my website : Dr.Seshagirirao MBBS

No comments:

Post a Comment