Monday, December 19, 2011

Which cooking oil is good for health?,వంటనూనెలలో ఆరోగ్యానికి ఏది మంచిది?

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • 'అన్ని నూనెలూ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. కొవ్వు పెంచేస్తాయి..' వంటి భావనలు చాలామందిలో పేరుకుపోయాయి. నిజానికి ఇది పూర్తిగా వాస్తవం కాదు . నూనెల నుంచి లభించే అన్ని రకాల కొవ్వుపదార్థాలు అనారోగ్యం కలిగించవు. వాటిల్లో ఉపయోగపడేవీ ఉంటాయి. ఆ వివరాలు తెలుసుకుని, పరిమితంగా వాడితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
శరీర పనితీరు బాగుండాలంటే విటమిన్లు, ఖనిజాలు ఎలా తప్పనిసరో కొవ్వుల వాడకం కూడా అంతే ప్రధానం. ముఖ్యంగా ఎ, డి, ఇ, కె వంటి కీలక విటమిన్లు శరీరానికి నేరుగా అందాలంటే కొవ్వులని ఆహారంలో తప్పక తీసుకోవాలి. ఇవి మనం తినే పప్పుల నుంచీ, తృణధాన్యాల నుంచీ కొంతవరకు అందితే.. మరికొంత వంటల్లో వాడే నూనెల నుంచి అందుతాయి. ఇంకొంత శాతం శరీరమే స్వయంగా విడుదల చేస్తుంది.
  • కొవ్వుల నుంచి ప్రధానంగా విటమిన్‌ ఎ, డి, ఇ, కె వంటి విటమిన్లు లభిస్తాయి. వీటితో పాటు వాటికుండే రంగు, రుచి, వాసన, ఇతర పోషకాల కారణంగా నూనెలు ప్రత్యేకతలను సంతరించుకొంటాయి. ముఖ్యంగా వాటిలోని ఫ్యాటీ యాసిడ్ల మేళవింపు, మోతాదు కారణంగానే నూనెలు ఎంత వరకు ఆరోగ్యప్రదం అన్న విషయం తెలుస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్లు మూడు రకాలుంటాయి. ఒకటి శాచురేటెడ్‌ (SFA) అయితే తక్కినవి అన్‌శాచురేటెడ్‌ రకాలు. అన్‌శాచురేటెడ్ లో మోనో అన్‌శాచురేటెడ్‌ (మూఫా-MUFA), పాలీ అన్‌శాచురేటెడ్‌(పూఫా-PUFA) ఉంటాయి.
శాచురేటెడ్‌ కొవ్వులు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటాయి. వాస్తవానికి శరీరం ఎప్పటికప్పుడు కావాల్సినంత శాచురేటెడ్‌ కొవ్వులని ఉత్పత్తి చేసుకొంటుంది. అయినా శాచురేటెడ్‌ కొవ్వులని బయట నుంచి అదనంగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాని పూర్తిగా దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరీర పనితీరుకు ఈ కొవ్వులు తప్పనిసరిగా అవసరం అవుతాయి.
  • ఇక మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులని కలిపి అన్‌శాచురేటెడ్‌ కొవ్వులుగా వ్యవహరిస్తారు.
మోనో అన్‌శాచురేటెడ్‌ అంటే, ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టగానే ఘనరూపంలోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కూరలు, వేపుళ్లలో ఉపయోగించడానికి మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు చక్కగా ఉపయోగపడతాయి. వేరుసెనగ, నువ్వులు, కనోలా, ఆలివ్‌ నూనెలు ఈ కోవకు చెందుతాయి. ఆలివ్‌ నూనె తప్ప తక్కినవి అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినా కూడా వీటిల్లో పెద్దగా మార్పు ఉండకపోవడం విశేషం.
  • పూఫా అధికంగా ఉండే నూనెలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయులని నియంత్రిస్తాయి. టైప్‌ 2 మధుమేహం సమస్యని నియంత్రిస్తాయి. గుండెజబ్బులు, రొమ్ముక్యాన్సర్‌ రాకుండా అడ్డుకొంటాయి. సోయాబీన్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెల్లో ఈ పూఫా అధికంగా లభ్యమవుతుంది.
కొలెస్ట్రాల్‌
  • శరీర పనితీరు చురుగ్గా ఉండటానికి, పాడయిన శరీర కణాలు కోలుకోవడానికి కొలెస్ట్రాల్‌ కొంతమేరకు అవసరమే. ఇది తగినంతగా లేకపోతే కుంగి పోవడం, నిరాశలోకి కూరుకుపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, కొన్నిసార్లు క్యాన్సర్ల బారినపడటం కూడా జరుగుతుంది. కొలెస్ట్రాల్‌ని సాధారణంగా గుడ్లు, మాంసం, ఇతర పాల ఉత్పత్తులన నుంచి పొందితే.. శరీరంలోని కాలేయం నుంచి కూడా కొంతవరకు అందుతుంది.
కొలెస్ట్రాల్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్‌ ఉండే (ఎల్‌డీఎల్‌) రకం. ఇది చెడు కొలెస్ట్రాల్‌. శాచురేటెడ్‌ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారం తినేవారిలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అధికంగా చేరుకొంటుంది. ఇవి గుండె జబ్బులు రావడానికి కారణం అవుతాయి. మరొకరకం కొవ్వు హెచ్‌డీఎల్‌.. దీన్నే హైడెన్సిటీ లిపోప్రొటీన్స్‌ అని కూడా అంటారు. ఇవి మంచి రకం కొవ్వులు.
  • ట్రాన్స్‌ఫ్యాట్లతో.. అప్రమత్తం
నూనెలను రుచికోసం కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో రసాయనిక చర్యలకు గురిచేసి ట్రాన్స్‌ ఫ్యాట్లుగా లేదా హైడ్రోజినేటెడ్‌ నూనెలుగా మారుస్తారు. బేకరీ, ప్యాక్‌ చేసిన పదార్థాల్లో.. రెస్టారెంట్లలో వీటిని ఉపయోగిస్తారు. సలాడ్‌ డ్రెస్సింగుల్లోనూ వాడతారు. ఇవి తక్కిన వాటితో పోలిస్తే చౌకగా ఉంటాయి. వనస్పతి ఈ కోవకి చెందినదే! ఇవి శరీరానికి హాని చేస్తాయి.
  • మేలు నూనెల గుర్తింపు ఎలా?
వంట నూనెల్లో.. ఇతరత్రా వంటకు పనికిరాని నూనెలని కలపడం ద్వారా వాటిని కల్తీకి గురిచేస్తారు. ఉదాహరణకి ఆముదం, ఆర్గీమోన్‌, మినరల్‌ నూనెలని వంటకు వాడే నూనెల్లో కలపడం ద్వారా కలుషితం చేసే వీలుంది. కొన్ని సందర్భాల్లో కాటన్‌సీడ్‌, పామోలీన్‌ వంటి చౌక నూనెలనూ ఇందుకు ఉపయోగిస్తారు. నూనెలు బాగా ముదురు రంగులో కనిపించినా, ముక్కవాసన వచ్చినట్టున్నా.. అప్పడాలు వంటివి వేయించిన వెంటనే రుచిలో తేడాగా ఉన్నా అది వాడేసిన నూనెగా గుర్తించాలి. ఒకసారి వాడిన నూనెలని మరోసారి మరిగిస్తే అవి అనేక అనారోగ్యాలకి దారి తీస్తాయి. ఒకసారి వాడిన నూనెని, వాడని దానితో కలపకూడదు. దానివల్ల తాజా నూనె కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. నూనెలని చల్లని, పొడి ప్రదేశాల్లో, సరైన మూత పెట్టి నిల్వ చెయ్యాలి. రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తీస్తే గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత వాడాలి.
  • సమాచారంతో అవగాహన
నూనెల్లో మూఫా, పూఫాల మేళవింపు ఎలా ఉందో చూసుకొని కొనుక్కొంటే ఆరోగ్యప్రదం. నూనెలో భారలోహాలు, హానిచేసే సూక్ష్మక్రిములు, ఇతరత్రా కలుషితాలు లేవని నిర్థారించుకోవాలి. నూనె ప్యాకెట్‌ని కొన్నాక దానిపై ఏం రాసి ఉందని చదివితే.. ఉత్పత్తి పేరు, తయారైన స్థలం, సమయం, అందులోని పోషకాల వివరాలు, కాల వ్యవధి తెలుస్తాయి. నూనెలో సింథటిక్‌ యాంటీ ఆక్సిడెంట్లని కలిపి ఉంటే వాటి వివరాలు పొందు పరచాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. నూనెలపై 'ఫ్రీ ఫ్రమ్‌ ఆర్గీమోన్‌ ఆయిల్‌ ఆర్‌ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌' అని రాసి ఉండటం తప్పనిసరి. ఎందుకంటే ట్రాన్స్‌ఫ్యాట్లు, ఆర్గీమోన్‌ నూనెలు అనేవి ఆరోగ్యానికి చేటు చేస్తాయి. అందుకే మీరు కొనే నూనెలో అవి లేవని నిర్ధారించుకోవాలి.
  • Source -- The Johns Hopkins Textbook of Dyslipidemia / 1. D. Paul Nicholls, MD, DSc, FRCP; 2. Ian S. Young, MD, FRCP, FRCPath
  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment